||సుందరకాండ ||

||ఎబది ఆరవ సర్గ తెలుగులో||


||ఓం తత్ సత్||
శ్లో|| తతస్తు శింశుపామూలే జానకీం పర్యుపస్థితామ్|
అభివాద్యాబ్రవీ ద్దిష్ట్యా పశ్యామి త్వామిహాక్షతామ్||1||
స|| తతః శింశుపామూలే పర్యుపస్థితాం జానకీం అభివాద్య బ్రవీత్ | దిష్ట్యా త్వాం అక్షతాం ఇహ పశ్యామి||
తా|| అప్పుడు శింశుపావృక్షమూలములో ఉపస్థితురాలైవున్న జానకికి అభివాదము చేసి ఇట్లు పలికెను. ' అమ్మా అదృష్టము కొలదీ నిన్ను క్షేమముగా ఇక్కడ చూచుచున్నాను'.
||ఓం తత్ సత్||

సుందరకాండ.
అథ షట్పంచాశస్సర్గః||

అప్పుడు హనుమంతుడు శింశుపావృక్షమూలములో ఉపస్థితురాలైవున్న జానకికి అభివాదము చేసి ఇట్లు పలికెను. 'అమ్మా అదృష్టము కొలదీ నిన్ను క్షేమముగా ఇక్కడ చూచుచున్నాను'.

అప్పుడు బయలుదేరుటకు సిద్ధముగా నున్న హనుమంతుని చూచుచూ, సీత భర్తపై తనకు గల స్నేహము ఉట్టిపడేటటట్టు గా ఇలా పలికెను. 'ఈ కార్యము సాధించుటలో బహుశ నీవు ఒక్కడివే చాలును. అలాచేసినచో నీ బలములు కీర్తి పెరుగును. పరశత్రువుల చీల్చి చెండాడగల రాముడు సమస్త లంకానగరమును సంకులము చేసి నన్ను తీసుకు పోయినచో అది ఆయనకు తగినట్లు ఉండును. అ మహాత్ముడు తన పరాక్రమమునకు అనుగుణమైన తీరుగా ఎట్లు చేయువలెనో దానికి తగు రీతిగా నీవు సూచనలు ఇమ్ము'.

అప్పుడు హనుమంతుడు సీతాదేవిచే పలకబడిన అర్థవంతముగా వున్న హేతువులతో కూడి యున్న వచనములను విని హనుమంతుడు ఇట్లు ప్రత్యుత్తరము ఇచ్చెను. ' అమ్మా! కాకుత్‍స్థుడు వానర భల్లూక సేనలతో త్వరలో వచ్చును. యుద్ధములో శత్రువులను జయించి నీ శోకమును తీర్చును'. వైదేహి కి ఈ విధముగా అశ్వాసనము ఇచ్చి హనుమంతుడు వెళ్ళుటకు నిశ్చయించుకొని వైదేహికి నమస్కరించెను. అప్పుడు ఆ కపిశార్దూలుడు స్వామి సందర్శనోత్సాహముతో గిరులలో శ్రేష్టుడైన అరిష్ఠ పర్వతమును ఎక్కెను.

ఎత్తైన పద్మక వృక్షములున్న నల్లని వనములతో కూడిన ఆ పర్వతము శిఖరాలమధ్య వ్యాపించిన మేఘములతో ఉత్తరీయము ధరించినదా అన్నట్లు ఉండెను. శుభకరమైన దివాకర కిరణములు ప్రేమాస్పదముగా మేల్కొలపగా పైకిలేచిన గైరికాది ధాతువులు మెరుస్తూ ఆ పర్వతపు కన్నులవలె నున్నవి. ఆ పర్వతపు శిలలపై పారుతున్న జలప్రవాహ ధ్వనులు పర్వతము మంత్రములు చదువుతున్నవా అన్నట్లు వినపడుచున్నవి. ఆ పొడుగాటి దేవదారువు వృక్షములు పైకెత్తిన బాహువులలాను ,శిఖరములలో పైనుంచి పడుచున్నజలపాతముల ధ్వనులు గొంతెట్టి అరుస్తున్నవా అన్నట్లు ఉన్నాయి. నల్లని శరత్కాల మేఘములు ఆ పర్వతమును కదుపుచున్నవా అన్నట్లు ఉన్నాయి. గాలితో కొట్టబడిన వెదురు చెట్లధ్వనులు పర్వతము వేణువు ఊదుచున్నట్లు ఉంది. పర్వతము మీద ఘోర సర్పముల బుసలు పర్వతము నిట్టూర్పులు విడుచుచున్నదా అన్నట్లు ఉన్నవి. పాదపర్వతములు పర్వతము మీద సంచరించే మేఘముల పాదాలమల్లే ఉండడముతో ఆ పర్వతమే నడుచుచున్నదా అన్నట్లు ఉండెను. ఆ పర్వతము అనేక శిఖరములతో గుహలతో శోభించుచుండెను. ఆ పర్వతము సాల తాళ వృక్షములతో దట్టముగా నిండి యుండెను.

ఆ పర్వతరాజము విరబూసిన పుష్పములు కల లతలతో, అనేకరకముల జంతు సమూహములతో ధాతుస్రావాలతో అలంకృతమై శోభించుచుండెను. అనేక సెలయేళ్ళు ప్రవహిస్తూ సంచారానికి ఆటంకము కలిగించు శిలల గుట్టలతో వున్న ఆ పర్వతము మహర్షులు యక్షులు గంధర్వులు కిన్నరులు ఉరగముల తో సేవింపబడుచుండెను. అనేక లతల వృక్షముల సముదాయముతో అలంకరింపబడిన ఆపర్వతపు గుహలను సింహములు ఆవాసముగా చేసుకొన్నాయి. పర్వతము మీద వ్యాఘ్రముల సముదాయము సంచరిస్తున్నాయి. ఆ పర్వతము మధురమైన ఫలములతో నిండిన వృక్షములతో నిండియున్నది.

పవనాత్మజుడైన హనుమంతుడు శీఘ్రముగా రామదర్శనమునకై ఆతురతో రామదర్శనము అన్న సంతోషముతో ఆ పర్వతము ఎక్కెను. అప్పుడు ఆ సుందరమైన పర్వతపు సానువులందు ఉన్న శిలలు హనుమంతుని పాదముల కింద నలిగి పెద్ద చప్పుళ్ళతో చూర్ణమైపోయాయి. ఆ మహాకపి ఆ సముద్రపు దక్షిణతీరమునుండి ఉత్తరతీరము చేరగోరి ఆ పర్వత శిఖరము ఎక్కి తన శరీరప్రమాణమును మరింత పెంచెను. అప్పుడు ఆ హనుమంతుడు ఆ పర్వత శిఖరముపై నిలబడి మీనములతో సర్పములతో నిండియున్న భయము కొలుపుతున్న సముద్రమును చూచెను.

వాయుపుత్రుడూ వానరశెష్ఠుడైన హనుమంతుడు దక్షిణ దిశనుంచి ఉత్తరదిశగా పయనించుటకు వాయువేగముతో ఆకాశం లోకి ఎగిరెను.

హనుమంతుడు పైకి ఎగిరినప్పుడు ఏర్పడ్డ ఒత్తిడికి ఆ పర్వతము అక్కడి ప్రాణూలతో సహా భూమిలోకి క్రుంగి పోసాగెను. అప్పుడు పర్వత శిఖరాలు అన్నీ కంపించడముతో వృక్షములు ఆన్ని వేళ్ళతో సహా నేలకూలిపోడముతో అందుండి బ్రహ్మాండమైన ధ్వని వెలువడినది. అతని ఊరువుల వేగధాటికి విరబూసిన పువ్వులతో వున్న వృక్షములన్నీ ఇంద్రుని ఆయుధముతో కొట్టబడినట్లు భూమిపై పడిపోయాయి. గుహలలో ఉండి చిక్కుపడిపోయిన మహాశక్తిమంతమైన సింహముల నినాదముతో ఆకాశము మిన్ను ముట్టినది.

విద్యాధరులు భయపడినవారై పక్కకి జారిన వస్త్రములతో అస్తవ్యస్తమౌతున్న ఆభరణాలతోభూమి నుంచి ఆకాశమునకి వెంటనే కంగారుగా ఎగిరిరి. పెద్ద బలమైన పాములు అ వత్తిడికి నలిగి పోయి మహా విషములను విరజిమ్ముతూ చుట్టలు చుట్టుకోసాగాయి. అప్పుడు కిన్నర ఉరగ గంధర్వ యక్షులతో కలిసి విద్యాధరులు ఆ హనుమంతుని వత్తిడి చే పీడింపబడుతున్న ఆ పర్వతమును వదిలి ఆకాశములోకి ఎగిరిరి. ఆ బలవంతునిచే నొక్కబడి వృక్షములతో నున్న శిఖరాగ్రములు భూమిలో ఒరిగి పాతాళంలోకి కుంగి పోసాగినవి.

పదియోజనముల విస్తారము కల ముప్పది యోజనముల ఎత్తుగల ఆ పర్వతము పూర్తిగా నేలమట్టమయినది.

ఆ వానరుడు కల్లోలమైన తరంగాలతోవున్న ఆ సముద్రమును అవలీలగా దాటగోరి అకాశములోకి ఎగిరెను

ఈ విధముగా వాల్మీకి రచించిన అదికావ్యమైన రామాయణములో సుందరకాండలో ఎబది ఆరవ సర్గ సమాప్తము.

|| om tat sat||

శ్లో|| స లిలింగ యిషుర్భీమం సలీలం లవణార్ణవమ్||34||
కల్లోలాస్ఫాల వేలాన్త ముత్పపాత నభో హరిః||35||
స|| స హరిః భీమం కల్లోలాస్ఫాలవేలాం తం లవణార్ణవమ్ సలీలం లిలింఘయిషుః నభః ఉత్పపాత||
తా|| ఆ వానరుడు కల్లోలమైన తరంగాలతోవున్న ఆ సముద్రమును అవలీలగా దాటగోరి అకాశములోకి ఎగిరెను
||ఓం తత్ సత్||